Grameen Bharat Mahotsav-2025: గ్రామీణ భారత్ మహోత్సవ్...! 1 d ago
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జనవరి 4న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన గ్రామీణ భారత్(రూరల్ ఇండియా) మహోత్సవ్-2025 జనవరి 9 వరకు నాబార్డ్, ఇతర భాగస్వాముల సహకారంతో జరగనుంది. గ్రామం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది - ”గావ్ బడే, తో దేశ్ బడే” స్ఫూర్తితో ఈ మహోత్సవ్ నిర్వహించబడుతుంది.
* థీమ్: అభివృద్ధి చెందిన భారత్ (వికసిత భారత్ @2047) కోసం సమ్మిళిత గ్రామీణ భారతదేశాన్ని సృష్టించడం.
* లక్ష్యం: చర్చలు, వర్క్ షాప్ లు, శిక్షణా కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతో పాటు, స్వావలంబన సాధించిన ఆర్థిక వ్యవస్థను నిర్మించడం, గ్రామీణ ప్రాంతాల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించడం.
* ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం
ఆర్థిక కార్యకలాపాలను అందరికీ చేరువ చేసి, సుస్థిర వ్యవసాయ పద్దతులను ప్రోత్సహిస్తూ, గ్రామీణ ప్రాంత ప్రజల్లో ముఖ్యంగా ఈశాన్య భారతంపై దృష్టి సారిస్తూ ఆర్థిక స్థిరత్వాన్ని, ఆర్థిక భద్రతను ప్రోత్సహించడం.
ఈ మహోత్సవ్ లో దృష్టి సారించే అంశాలు:
ఔత్సాహిక ప్రారిశ్రామికవేత్తలుగా మహిళలను ప్రోత్సహించి వారికి సాధికారత కల్పించడం. గ్రామీణ ప్రాంతాల రూపురేఖలను సమష్టిగా మార్చే దిశగా ప్రణాళికలను రూపొందిచేందుకు ప్రభుత్వ అధికారులను, మేధావులను, గ్రామీణ ప్రాంతానికి చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను, కళాకారులను, వివిధ రంగాలకు చెందిన నిపుణులను ఒక్కచోటకు చేర్చడం. గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధిని పెంచేందుకు సాంకేతికత వినియోగం, వినూత్న పద్ధతులను అవలంబించడంపై చర్చలను ప్రోత్సహించడం. శక్తిమంతమైన ప్రదర్శనలు, ఎగ్జిబిషన్ల ద్వారా భారతదేశ సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడం.